FOOTPRINTS IN THE SAND
ఇసుకలో అడుగుల గురుతులు
ఓ రాత్రి నేనొక కలగన్నాను.
కడలి తీరంలో ఆ దేవునితో నేను నడుస్తున్నట్టు.
మబ్బులు అలుముకున్న ఆకాశంలో
నా జీవితమంతా దృశ్యాలుగా మెరుస్తున్నట్టు.
ప్రతి దృశ్యానికీ
ఇసుకలో రెండు జతల అడుగుల గురుతులను నేను చూసాను.
ఒకటి నావి మరొకటి నా దేవుడివి.
చివరకు నా జీవితపు ఆఖరి దృశ్యం నా ముందు మెరిసినపుడు
వెనక్కి తిరిగి వెతికాను అడుగుల గురుతుల కోసం.
అప్పుడు నేనెన్ని సార్లు గమనించానో
నా జీవిత గమనంలోని అడుగుల గురుతులలో
అత్యంత హీనమైన అతి బాధాకరమైన
ప్రతీ దృశ్యంలో నేను చూసినవి
ఒక్క నా అడుగుల గురుతులను మాత్రమే!
ఇది ఎంతగా బాధించిందో నన్ను
అడగకుండా ఉండలేకపోయాను దేవుణ్ణి.
'దేవా! నీవే అన్నావు
ఎప్పుడైతే నిన్ను నేను అనుసరించడం మొదలు పెడతానో
నువ్వెప్పుడూ నాతోనే నడుస్తావని.
కానీ, కొన్ని అతి కష్టమైన
ఇంకొన్నిఅత్యంత దుఃఖమయమైన నా జీవిత ఘడియల్లో
నాకు కనిపించినవి ఒక్క నా అడుగుల గురుతులే.
అర్థం కానిదల్లా, నువ్వు నాకెప్పుడు కావాలో
అప్పుడే నీవు నన్నెందుకు వదిలి వెళ్ళావోనని'
చల్లగా గాలి గుస గుసలాడినట్లుగా
అతని స్వరం నా చెవులను తాకింది
' నీవు నా అమూల్యమైన బిడ్డవు.
ఎన్నటికీ..... ఎప్పటికీ....
నిన్ను వదిలి వుండలేను విడిచి వెళ్ళనూలేను.
నీ ప్రయత్నాలలో
నీ పరీక్షా సమయాలలో
నువ్వు చూసిన ఒకే ఒక్క జత అడుగుల గురుతులు
నా భుజాలమీద నిన్ను మోస్తున్నప్పటివే'
అనువాదం: పారువెల్ల
మూలం: MARY STEVENSON
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem