* అక్షరం *
నింగితో నేలతో
గాలితో ధూళితో
నిప్పుతో నీరుతో
ఆటాడి ముద్దాడి
చెట్టుని పుట్టని
అలలని శిలలని
పువ్వులని గువ్వలని
పలకరించి పులకరించి
అడుగులతో చూపులతో
ఊగుతూ సాగుతూ
రెప్పలతో రెక్కలతో
వాలుకుంటూ ఎగురుకుంటూ
లోయల్లో మబ్బుల్లో
జారిపోతూ తేలిపోతూ
తీరాలను దూరాలను
ముడివేస్తూ తడిపేస్తూ
స్నేహాలను విరహాలను
మురిపిస్తూ మరిపిస్తూ
ప్రాయాలను ప్రణయాలను
లాలిస్తూ పాలిస్తూ
గాయాలను దుఃఖాలను
ఊకొడుతూ జోకొడుతూ
గతాన్ని గమ్యాన్ని
వినిపిస్తూ తిలకిస్తూ
చీకట్లను ఇక్కట్లను
శపిస్తూ భరిస్తూ
స్వర్గాలను నరకాలను
కామిస్తూ క్షమిస్తూ
ఆశలను ఆశయాలను
సేవిస్తూ శ్వాసిస్తూ
కల్లోలాలను కలలను
మోస్తూ మోహిస్తూ
మేఘంలా కరిగిపోతూ
మట్టిలా తడిసిపోతూ
దిక్కుల్ని మొక్కుల్ని
వాటేసుకొని వెంటేసుకొని
వెన్నెలలా వెలుగుల
ఉరుములా మెరుపులా
ఉషస్సులా తపస్సులా
నీకోసం నీకోసం
నీకోసం నేనొస్తా
శరమై
వరమై
అక్షరమై
~ పారువెల్ల ~
10-07-2014
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem