* ఏది నీది? *
నేల నీదనుకొని రెండడుగులు ముందుకేస్తే
జారి పడినా.., నిజం నీకు తెలియక పోవచ్చు
ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు
వాళ్ళ భేరాలు కుదిరాక
నీకంటూ ఏదీ మిగలకపోవచ్చు
నీ అడుగుల్ని నువ్వే నిందించకు
నిన్ను చూసేందుకు
నీ కంటితడి తుడిచేందుకు
లేనివాడెవడో ఒకడున్నాడనుకుంటావు
కలలను ప్రేమిస్తూ కాలం గడిపేస్తావు
కురిసే ప్రేమ నీకోసం కాకపోవచ్చు
ప్రకటనలు హామీలు
ప్రవాహమై ప్రవహించవచ్చు
నువ్వు కొట్టుకోనీ పోవచ్చు
ఏది నీదో
ఏవి నీవో
జవాబులు చిక్కినట్టే చిక్కి
చేప పిల్లలా జారుకుంటాయి
నేస్తం!
జీవితం నీది కాదు జీతానిది
జీతం పెరిగే ధరలది
బ్రతుకూ నీది కాదు
దేశానిది అసలే కాదు
గుద్దే లారీలది
కూలే విమానాలది
పేలే బాంబులది
మరణమొక్కటే నీది
వేల మరణాల తరవాత
~ పారువెల్ల ~
(June,2014)
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem